V6 News

ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టింపు లేదా?..అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫైర్

ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టింపు లేదా?..అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫైర్

జిన్నారం, వెలుగు: ఉపాధి దొరకుతుందని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని చెట్ల పోతారం పరిధిలోని అయ్యమ్మ చెరువు పరిస్థితిపై సోమవారం మున్సిపల్  పాలకవర్గం, వివిధ శాఖల అధికారులతో చెరువు కట్టపై రివ్యూ చేశారు.

కలుషిత జలాలు చెరువులో కలవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తూ చెరువులను రసాయన జలాలతో కాలుష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సూచించినా మార్పు రావడం లేదన్నారు. ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, పరిశ్రమలను తరిమికొడతామని హెచ్చరించారు.

కాలుష్యాన్ని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న 14 పరిశ్రమలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పీసీబీ ఈఈ కుమార్  పాఠక్, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, మున్సిపల్  చైర్​పర్సన్  సుష్మ గణేశ్, వైస్  చైర్​పర్సన్  మహేందర్ గౌడ్,  కమిషనర్  వెంకటరామయ్య, సీఐ రవీందర్ రెడ్డి,   మున్సిపల్  చైర్​పర్సన్  జనార్ధన్  పాల్గొన్నారు.